అంబేద్కర్ గారి విద్యాభ్యాసంలో రెండో దశ

విద్యాభ్యాసంలో రెండో దశ

వంట, వార్పు, వడ్డన అంతా ఆ గదిలోనే జరగాలి. ఆ గదిలోనే ఒక ప్రక్క కుక్కి మంచం క్రింద మేకపిల్ల, కోడి పెట్టి, ఆ ప్రక్కన వంది చెలుకు, మరోమూల తిరుగలి. వీటితోబాటు ఏడుమందికి పైగా ఆ ఇంటిలోనే మసలడమంటే దుర్భరమై పోయింది. ఈ యిరకాటంలో భీమ్ రావ్ చదువు సరిగ్గా సాగలేదు. కుమారుడి చదువు భగ్నం గావడం రామ్ జీ సక్పాల్ సహించలేకపోయాడు. ఎన్ని కష్టాలు అనుభవించైనా భీమ్ రావు చదివించ దానికే తాను నిర్ణయించుకొన్నాడు.

అందుచేతనే తన చాలీచాలని జీతంలోనే కొంత మిగిల్చి భీమ్ రామ్ కు కావలసిన పుస్తకాలు, బట్టలు కొన్నాడు. కాని చదివేందుకా చిన్న గదిలో వసతి లేదు. దీనికి రామ్ జీ సక్పాల్ ఒక పద్ధతి కనిపెట్టాడు. రాత్రి భోజనాలవగానే భీమ్ రావ్ ని నిద్ర బొమ్మని రామ్ జీ సక్పాల్ వాకిట్లో గూర్చొని కునికిపాట్లు బదుతూండే వాడు. వేకువజాము వరకు కొడుకుని నిద్రబోనిచ్చి ఆ తర్వాత నిద్రలేపి బుడీ దీపం వెలిగించి వాకిట్లో గూర్చోబెట్టి చదువుకొమ్మని తరువాత తాను నిద్రబోయేవాడు. తెల్లవారేంత వరకు చదివిన తర్వాత భీమ్ రావ్ స్నానం జేసి భోజనం ముగించి స్కూలుకు వెళ్ళేవాడు. ఆ విధంగా తన ప్రియతమ పుత్రుని ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ తండ్రి ఎన్నో రాత్రులు, నెలలు, సంవత్సరాలు జాగారం చేశాడో ఆ సందర్భంలో తండ్రి కొడుకులు బిడ్డ అవస్థ, మనోవేదన, ఆ తండ్రీకొడుకులిద్దరికే తెలుసు.

కుమారుడి పుస్తకాలు, బట్టల కోసం రామ్ జీ సక్పాల్ ఒక్కొక్కప్పుడు అప్పు చేయాల్సి వచ్చేది. ఎక్కడా అప్పుబుట్టకుంటే తన కుమార్తెల నగలు తాకట్టు బెట్టాల్సి వచ్చేది. బొంబాయి వంటి నవ నాగరికమైన నగరంలో సైతం కులతత్వం వెయ్యి పాదాల్లో విలయతాండవం జేస్తూండేది. భీమ్ రావ్ చదివే హైస్కూల్లోని విద్యార్థులు తనని అంటరాని వాడని అవహేళన జేస్తూండేవారు. వారు త్రాగే కూజాలోని నీటిని భీమ్ రావ్ త్రాగడానికి వీల్లేదు సరిగదా ఆ కూజాను ముట్టడానికి కూడా వీల్లేదు. ఆ స్కూలు విద్యారొకడు గ్లాసుతో నీళ్ళను ధారగా బోస్తూంటే భీమ్ రావ్ క్రింద దోసిలి పట్టుకొని త్రాగాలి. ఎన్ని అవమానాలకైనా భరించి చదువును కొనసాగించేందుకే భీమ్ రావ్ కృతనిశ్చయుడైనాడు. పాఠశాల విద్యార్థుల్లోని కులతత్వం విషయమలా వుండగా పాఠశాలలోని ఉపాధ్యాయులు సైతం భీమ్ రావ్ ని అస్పృశ్యతా దృష్టితోనే జూడసాగారు.

హైస్కూలు తరగతుల్లో మామూలు పాఠాలతోబాటు ప్రత్యేక పాఠ్యభాగం ( Optional ) ఒకటి ఉంటుంది. శ్రీమరావ్ తన ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని గోరుకున్నాడు. అంటరాని కులస్థుడికి సంస్కృత పాఠ్యభాగము యిచ్చేందుకా ఉపాధ్యాయు లంగీకరించలేదు. దీనికి భీమ్ రావ్ ఎంతో బాధపడ్డా గత్యంతరం లేక పర్యన్ భాషను ప్రత్యేక పాఠ్యభాగంగా దీసుకోవాల్సి వచ్చింది. కులతత్వంతో తనకు నిరాకరించబడ్డ సంస్కృతాన్ని ఎలాగైనా నేర్చుకు తీరాలనే దృఢనిశ్చయం భీమ్ లో ఏర్పడింది. కొంతకాలం తరువాత తన స్వయంకృషితోనే సంస్కృతం సాంతం వరించి ఆపై వేద వేదాంగాలన్నింటిని తిరగవేసి జీర్ణించుకొని వాటిలోని గుట్టును రట్టు చేయగలిగాడు.

1907వ సంవత్సరంలో భీమ్ రావ్ మెట్రిక్యులేషన్ పరీక్ష మంచి మార్కులో పాసైయ్యాడు. ఆ రోజుల్లో అంటరాని కులస్థుడు మెట్రిక్ పాసవడమంటే గొప్ప విశేషమే. ఈ వార్త విన్న రామ్ జీ సక్పాల్ ఆనందాని కవధుల్లేవు. బొంబాయి పట్టణంలోని మహర్ కుల పెద్దలంతా గుమిగూడి భీమ రామను ఘనంగా సన్మానించాలని తీర్మానించారు. ఆ సభకు ప్రముఖ సంఘసంస్కర్తయైన యస్ . కె . బోలెగార్ని, సిటీ హైస్కూల్ ఉపాధ్యాయుడైన క్రిస్టాట్ అర్జున్ కేలుస్కరను ఆహ్వానించారు. ప్రముఖ మరారీ పండితుడైన, కేలుస్కర్ లో సంఘ సంస్కరణాభానాలు మెండుగా వుండేవి. పేద విద్యార్థులను ప్రత్యేకమైన శ్రద్ధతో గమనించి ప్రోత్సహిస్తుండేవాడు.

భీమ్ రావు విద్యార్ధనలో గల ఆసక్తిని గూర్చి కేలుస్కర్ కు ముందే తెలుసు. కేలుస్కర్ పండితుడు రోజు సాయంత్రం షికారుకు వెళ్ళి పార్కులో గూర్చొనేవాడు. అదే పార్కులో భీమ రావ్ ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించేవాడు. చదువుపై ఆ బాలునికి గల శ్రద్ధకు ఎంతో ఆశ్చర్యపడ్డ కేలుస్కర్ పండితుడా బాలుని వద్దకు వచ్చి వివరాలడిగి తెలుసుకొని తాను సైతం కొన్ని పుస్తకాలను ఆ బాలుని కందజేస్తూ పలువిధాలుగా ప్రోత్సహిస్తుండేవాడు. ఆ విధంగా తన వద్ద నుండి భీమ్ రావ్ దీసికొని చదివిన గ్రంథాల్లో ముఖ్యమైనది, “ బుద్ధుని జీవితం ” అన్న గ్రంథం. ఆనాటి సన్మానసభకు బొంబాయి పట్టణంలోని పలు ప్రాంతాల మహర్ కులస్థు లంతా విచ్చేశారు. భీమ్ రావ్ కు విద్యార్జనలో గల ప్రగాఢమైన దీక్షాసక్తులను ప్రశంసిస్తూ ఆ బాలుణ్ణి పై చదువులు చదివించే పక్షంలో తాను సైతం కొంత వరకు సహాయపడగలనని కెలుస్కర్ పండితుడు చెప్పాడు.

ఇంతకూ యీ బాలుణి పై చదువులు చదివించే స్థామత తన తండ్రి కున్నదా అని కేలుస్కర్ ప్రశ్నించినప్పుడు రాంజీ సక్పాల్ వెంటనే లేచి ఎన్ని కష్టాలనైనా అనుభవించి తన కుమారుణ్ణి పై చదువులను చదివించి తీరుతానని జవాబు చెప్పాడు. సభలో కరతాళధ్వనులు మ్రోగాయి.

మరుపురాని జ్ఞాపకాలుతో కూడిన కొన్ని సంఘటనలు

ఉజ్వల భవిష్యత్తుగల కుమారుని పై తండ్రి జూపుతున్న ప్రేమకు, త్యాగానికి కేలుస్కర్ పండితుడు పులకితుడైనాడు. ఏ విధంగానైనా యీ బాలకునికి సహాయపడాలనే నిర్ణయానికొచ్చాడు, కేలుస్కర్ పండితుడు. పై చదువుల కెళ్ళకముందే కుమారుడికి పెండ్లి జేయాలనే ప్రయత్నంలో తండ్రి రాంజీ వధువును వెదక నారంభించాడు. ఆఖరుకు రమాబాయి అనే కన్యారత్నంతో భీమ్ రావ్ వివాహం నిశ్చయమైంది. కాని వివాహం జరిపేందుకు రాంజీ సక్పాలకున్న ఒక్క గదీ చాలదు. దీనికొక మార్గం కనిపెట్టాడు రాంజీ సక్పాల్. వధూవరుల తరపు బంధుమిత్రులంతా రాత్రివేళకు బైకుల్లా ప్రాంతంలో వుండే చేపల మార్కెట్ జేరుకున్నారు. చేపల అమ్మకం ముగిసి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోగానే యీ పెండ్లికి వచ్చిన చుట్టాలంతా ఆ చేపలమ్మే రాతిదిమ్మల పైకి జేరుకొన్నారు.

ఆ రాతి దిమ్మల్లో కాస్తంత విశాలంగా వుండేది వధూవరుల వుచితాసనం! ఆ రోజు సాయంకాలం వర్షం రావడం వల్ల మురికి నీరు, నీచునీరు కలిసి రాతిదిమ్మల ప్రక్కనే వున్న కాలువల్లో ప్రవహిస్తూ వాసనలు ముక్కు పుటాల్ని బ్రద్దలు జేస్తున్నవి. ఈ విధంగా “ఆకాశమే పందిరిగా, భూమే ఆరుగ్గా, చంద్రుడు, నక్షత్రాలే దీపాలుగా భీమ్ రావ్, రమాబాయ్ వివాహం” తెల్లవారేలోపుగా ముగించి తిరిగి చేపలవాళ్ళు మార్కెట్టు వద్దకొచ్చే సమయానికి ఎక్కడి చుట్టాలక్కడ సర్దుకొన్నారు. మాజీ సుబేదార్ రామ్ జీ సక్పాల్ తన కుమారుడు, కోడలు యిత్యాదులతో పరేల్‌లోని తన నివాసానికి జేరుకున్నారు. వివాహ సమయానికి భీమ్ రావ్ వయస్సు పదిహేడేండ్లు, వధువు రమాబాయి వయస్సు తొమ్మిదేళ్ళు మాత్రమే. రమాబాయి తండ్రి వాలంకర్ దాపోలి రైల్వేస్టేషన్లో పోర్టరుగా పనిచేసేవాడు. వాలంకర్ ఆర్థికంగా అతి పేదవాడైనా గుణసంపదల్లో పరమ స్వాతికుడు. వాలంకర్ సైతం రాంజీ సక్సాలకు మల్లేనే కబీరు భక్తుడు. తండ్రి మనస్తత్వాన్ని, భయభక్తుల్ని పుణికి పుచ్చుకొన్నది రమాబాయి. వివాహానంతరం భీమ్ రావ్ బొంబాయి పట్టణంలోని ఎలిఫిన్స్టన్ కళాశాలలో ప్రవేశించి ఎఫ్ . ఏ . పరీక్షకు చదువ నారంభించాడు. కాలేజీ చదువులో ప్రవేశించగానే భీమ్ రా లో నానాటికి వృద్ధి చెందుతున్న ఏకాగ్రత, జ్ఞానతృష్ణ నిరంతర గ్రంథపఠనం లాంటి లక్షణాలను జూసి తండ్రి తన్మయత్వం చెందేవాడు.

భీమ్ రావ్ విద్యాపరనంలో ఎంత ఆసక్తి జూపేవాడో క్రికెట్, టెన్నిస్ వంటి ఆటల్లోగూడ అంత శ్రద్ధ జూపేవాడు. బొంబాయి అంతర్కశాశాలల క్రికెట్ ఆటలపోటీల్లో పాల్గొని పైజులు గూడ గెలుచుకున్నాడు. భీమ్ రావ్ ఎఫ్ . ఎ . పరీక్ష మంచి మార్కులతో పాసై బి . ఎ . తరగతిలో ప్రవేశించే కాలానికి తన తండ్రి యొక్క ఆర్ధిక పరిస్థితి మరీ దిగజారిపోయింది. సంపాదన తక్కువై సంసార భారం పెరగడంతో రానురాను రోజులు గడవటమే కష్టమైపోయింది. ఇలాంటి ఆపత్స మయంలో కేలుస్కర్ పండితుడు ఆదుకొని తాను జేసిన వాగ్దానం నెరవేర్చుకొన్నాడు. బరోడా మహారాజైన శాయాజీరావు గైక్వాడ్ ఒకానొక బహిరంగసభలో ప్రసంగిస్తూ పేద కులాలకుజెందిన విద్యార్థుల్లో తెలివితేటలు గలిగి అభివృద్ధికి రాగల అవకాశాలుండి పెద్ద చదువులు చదివేందుకు ఆర్థికంగా కష్టపడుతున్నట్లైతే అట్టివారికి సహాయం చేయదలచినట్లు ప్రకటించడం కేలుస్కర్ పండితుడు లోగడ విన్నాడు. భీమ్ రావ్ విద్యా విషయంలో మెరుపులాంటి ఆలోచన రాగానే కేలుస్కర్ పండితుడు భీమ్ రావ్ ను వెంట బెట్టుకొని వెళ్ళి బరోడా మహారాజును సందర్శించి భీమ్ రావ్ యొక్క తెలివితేటల్ని ఆర్థిక పరిస్థితిని వివరించాడు.

బరోడా మహారాజు ప్రశాంతంగా విన్న తరువాత భీమ్ రావ్ తెలివితేటలు పరీక్షించేందుకై కొన్ని ప్రశ్నలు వేశాడు. భావగర్భితమైన సమాధానాలు విని ఆ బాలుని మేధాశక్తిని ఇట్టే పసిగట్టిన బరోడా మహారాజు నెలకు 25 రూపాయలు ఉపకారవేతనంగా యిచ్చేందుకు కంగీకరించాడు. భీమ్ రావ్ సంతోషాని కవధుల్లేవు. తనకు ఆత్మీయుడైన పేద విద్యార్థికి బరోడా మహారాజు చేయనున్న సహాయానికి కేలుస్కర్ పండితుడు చేతులెత్తి మొక్కాడు. అనుకోని విధంగా కలిసివచ్చిన బరోడా మహారాజా సహాయ సహకారాలతోనే దిన భత్యానికే కరువైన రాంజీ సక్పాల్ కొడుకు భీమరావ్ సీమ చదువులు చదివి ప్రపంచ మేధావివర్గంలో ఒకడు కాగలిగాడు. భీమ్ రావ్ వంటి ఉజ్వల భవిష్యత్తుగల విద్యార్థికి సహాయపడిన బరోడా మహారాజు చరిత్రలో చిరస్మరణీయుడైనాడు. భీమ్ రావ్ అంబేడ్కర్ విద్యాభివృద్ధికి తోడ్పడి తద్వారా యావద్భారత అస్పృశ్యకోటి యొక్క దాస్య విముక్తికే కారణభూతుడైన బరోడా మహారాజా శ్రీ షంషేర్ బహదూర్ శాయాజీరావ్ గైక్వాడ్ గూర్చి గూడ కొంత దెలిసికోవడం అవసరం.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories