డా॥ అంబేడ్కర్ ఆత్మాభిమానం & స్వయం కృషి

డా॥ అంబేడ్కర్ స్వయం కృషి

బొంబాయిలోని ప్రముఖ న్యాయవాదియైన సర్ చమలాల్ హీరాలాల్ సీతల్వార్ యల్.యల్.డి.యీ సంఘాని కధ్యక్షులుగాను, శ్రీమియర్ నసీమ్ ఐ.పి. రుస్తుంటే జిన్ వాలా ఉపాధ్యక్షులుగాను ఎన్నికయ్యారు. మేనేజింగ్ కమిటీకి డా॥ అంబేడ్కర్ అధ్యక్షులుగాను, శ్రీ శివతార్కర్ కార్యదర్శిగాను, జాదవ్ కోశాధికారిగానూ ఎన్నికయ్యారు. బి.జి.కేర్, డా॥ పరాంజ పే, డా.వి.పి. నారిమాన్ యిత్యాది ప్రముఖులంతా కార్య నిర్వాహక సభ్యులయ్యారు.

బహిష్పత హితకారిణీ సభకు బొంబాయి కేంద్రంగా మహారాష్ట్ర దేశంలోని వివిధ జిల్లాలలో ఉపసంఘాలు ఏర్పాటు చేసి తద్వారా నిమ్న జాతుల్లో మనో వికాసాన్ని, సంఘ చైతన్యాన్ని గల్గింప జేసేందుకై మహాసభలను, సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగ ఏర్పాటు జేయసాగారు. 1924వ సంవత్సరాంతంలో జరిగిన తొలి వార్షిక మహాసభకు మహారాష్ట్ర దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి గూడ ప్రతినిధులు విచ్చేసి కార్యక్రమాల్లో ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. డా॥ అంబేడ్కర్ యీ వార్షిక మహాసభలో ఉపన్యసిస్తూ యావద్భారత దేశంలోని నిమ్న జాతీయులంతా “ఆత్మాభిమానం ” “స్వయం కృషి” యొక్క విలువలను గ్రహించి తమ యొక్క సాంఘికాభివృద్ధికి యితరులపై ఆధార పడకుండా తమంతట తాముగా సంఘటితపడి నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో కృషి జేయాల్సిందిగా కోరాడు. బొంబాయి రాష్ట్రంలో డా॥ అంబేడ్కర్ నాయకత్వాన ఏర్పాటై దినదినాభివృద్ధి జెందుతున్న యీ సాంఘిక ఉద్యమ ప్రభావం దేశంలోని యితర రాష్ట్రాల పైన గూడ ప్రసరించింది. ఆంధ్ర ప్రదేశంలో ఆదియాంధ్ర మహాసభ, తెలంగాణలో అది హిందూ మహాసభ, తమిళనాడులో ఆది ద్రావిడ మహాసభ యీ విధంగ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిమ్న జాతుల యాజమాన్యంలో సాంఘిక సంస్థ లేర్పడ్డవి.

నిమ్న జాతుల్లో నానాటికి వృద్ధి జెందుతున్న సాంఘిక చైతన్యం, సంఘటిత శక్తి అగ్రవర్ణాలకు జెందిన వివిధ సాంఘిక, రాజకీయ సంస్థల వారినీ ఆకర్షించాయి. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్ధన సమాజం, హిందూ మహాసభ యిత్యాది హిందూ సంఘాలు గూడ నిమ్న జాతుల సాంఘికాభివృద్ధి విషయంలో మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధ జూపసాగాయి. ఆఖరుకు కాంగ్రెసు పార్టీకి మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న గాంధీజీ గూడ అస్పృశ్యుల సాంఘికాభివృద్ధి గూర్చి ఉపన్యాసాలివ్వసాగాడు. కాని నాల్గవ ప్రకరణము మంత్రాలకు చింతకాయలు రాలనట్లు కేవలం సానుభూతి ఉపన్యాసాల వల్ల గాని, హిందువుల యాజమాన్యాన నడిచే వివిధ సాంఘిక సంస్థల యొక్క ముఖ ప్రీతి వచనాల వల్ల గాని అస్పృశ్యుల సాంఘిక పరిస్థితుల్లో మార్పులు రాజాలవు.

దుస్థితికి హిందూ మతంలోని వర్ణవ్యవస్టే కారణం

అస్పృశ్యుల సాంఘిక దుస్థితికి హిందూ మతంలోని వర్ణవ్యవస్టే కారణం. గాంధీజీ గాని, హిందూ సంస్కరణ సంఘాలవారెవ్వరు గాని హిందూమతంలోని వర్ణ వ్యవస్థ నెదిరించకుండా అస్పృశ్యుల్లో సాంఘికాభివృద్ధిని సాధించాలను కోవడం కేవలం నిరూపయోగమైన విషయం. అసలు హిందూ మతంలోని వర్ణ వ్యవస్థను నిర్మూలించడం ద్వారానే అస్పృశ్యతను రూపుమాపా లనేది డా॥ అంబేడ్కర్ నినాదం. గాంధీజీ, సావర్కర్ వంటి వారి సాంఘిక కార్యకలాపాలు కేవలం సంస్కరణా ధోరణికి జెందినవి. డా॥ అంబేద్కర్ విధానం పూర్తిగా విప్లవాత్మకమైనది. శిథిలావస్థలో కూలిపోవడానికి సిద్ధంగా వున్న యింటికి మాచికలు వేసి, సున్నం పూతలు పూయడం లాంటిది సంస్కరణవాదుల ధోరణి. శిథిలావస్థలో వున్న యింటిని సొంతం కూల్చి వేసి అదే స్థానంలో క్రొత్త యింటిని నిర్మించడం విప్లవధోరణి.

బహిష్కృత హితకారిణీ సభ ఆధ్వర్యాన జరిగే బహిరంగ సభల్లో డా॥ అంబేడ్కర్ యిచ్చే ఉపన్యాసాల వేడికి తరతరాలుగా వస్తున్న బానిస వృత్తులపల్ల చల్లబడిపోయిన నిమ్న జాతుల రక్తం వేడెక్కి ఉప్పొంగసాగింది. “ అత్యంత దయనీయమైన, దీనాతి దీనమైన మీ ముభాలను జూస్తున్నప్పుడు, మీ రనుభవిస్తున్న కష్టాలను గూర్చి విన్నప్పుడు నా గుండెలు దహించుకుపోతున్నవి. నిర్భంద బానిస వృత్తులు జేస్తూ తరతరాలుగా కృశించి, నశించిపోతున్న మానాభిమానాలను జంపుకొని మీరా బానిసవృత్తులకే కట్టుబడియున్నారు. గాని, విముక్తి మార్గం ఆలోచించడం లేదు. ఈ నీచమైన జీవితాలను గడపడం కంటే పుట్టిన వెంటనే చనిపోవడం మేలు. ఈ దుర్భరమైన, దుస్సహమైన, దారుణమైన జీవితాలతో భూమికే భారంగా మీరెందుకు జీవించాలి? ఈ నీచాతినీచమైన జీవితాలను కొనసాగించడం కంటె ఒక్కుమ్మడిగా చావడం మేలు, మానవుడిగా జన్మ ఎత్తిన ప్రతివాడికి తిండీ, బట్ల, వసతి ఏర్పాట్లుతో గౌరవమైన జీవితం కొనసాగించాలంటే మనలో ముందు ఆత్మ గౌరవం ఏర్పడి మన అభివృద్ధికి స్వయం కృషి కంటే మించిన మార్గం మరొకటి లేదనే విశ్వాసము ఏర్పడాలి. ” ఈ విధంగా నడిచేవి డా॥ అంబేద్కర్ ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాలు విన్న ప్రతి నిమ్న జాతీయుడి రక్తమాంసాలు పొంగి, వర్ణనాతీతమైన ఆగ్రహావేశాలు ఆవహించేవి. హిందూ సంస్కర్తల పేలవమైన సంస్కరణా ధోరణులపై ప్రసంగిస్తూ “ మన దేశాన్ని ఎందరో చక్రవర్తులు, మహారాజులు పరిపాలించారు.

కాని, వారిలో ఎవరైనా, యి అస్పృశ్యులను నిర్బంధ దాస్యం నుండి తప్పించగలిగారా ? మహాత్ములు, మహర్షులు డజన కొద్ది పుట్టిగిట్టిన దేశమిది, కాని వారిలో ఎవరైనా మనకు అస్పృశ్యతా విముక్తి గల్గించ గలిగారా ? వంద సంవత్సరాలుగా తెల్లదొరలు మన దేశాన్నేలుతున్నారు. వీరిలో ఎవ్వరైనా మన దయనీయ పరిస్థితులను గూర్చి పట్టించుకొన్నారా? ఇతరు లెవ్వరో వచ్చి మనల్ని ఉద్దరిస్తారను కోవడం కేవలం అవివేకం. మన సమస్యలేమిటో మనం గ్రహించి వాటిని మనమే పరిష్కరించుకోవాలని చెప్పాడు. ఒకానొక సభలో డా॥ అంబేద్కర్ ప్రసంగిస్తుండగా తన సూటైన ఉపన్యాసానికి ఉద్రిక్తులైన నిమ్న జాతీయులు వీరావేశంతో లేచి నిలబడి పోయారు. తక్షణం హిందూసమాజంపై కక్ష దీర్చుకోవాలనే ఆగ్రహంతో పిడికిళ్ళు బిగించ సాగారు. వాళ్ళను సమాధానపరచి కూర్చోబెట్టేందుకు కార్యకర్తలు నానా యాతనబడాల్సి వచ్చింది.

బహిష్కృత హితకారిణి సభ యొక్క నిర్మాణ కార్యక్రమంలో నిమ్న జాతీయుల్లో విద్యాభివృద్ధి గల్గించడం అత్యంత ప్రధానమైన అంశం. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యాన షోలాపూర్ లోని హైస్కూల్ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ స్థాపించబడింది. బొంబాయి పట్టణంలో ఒక పఠనాలయం, హాకీ క్లబ్బు ఏర్పాటు చేయబడ్డవి. వీటివల్ల నిమ్న జాతీయ యువకులు త్రాగుడు, జూదంలాంటి వ్యసనాలను మాని చదువు పట్ల, విజ్ఞాన విషయాల పట్ల ఆసక్తి జూపుతూ హాకీ ఆటల్లో ఎక్కువగా పాల్గొనసాగారు. బహిష్కృత హితకారిణీ సభ ఆధ్వర్యాన “ సరస్వతి విలాస్ ”అనే పేరుతో ఒక మాసపత్రికను గూడ ప్రచురించ సాగారు. ఈ కార్యక్రమాల ద్వారా నిమ్న జాతీయుల వేషభాషల్లోనూ, నడవడికా సంస్కృతుల్లోనూ అద్భుతమైన మార్పులు కనిపించసాగాయి.

1925 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో డా॥ అంబేడ్కర్ జాదవ్ తో గలిసి నిపాణి, మూల్వాన్, రత్నగిరి, గోవా ప్రాంతాలు పర్యటించి అనేక సభల్లో పాల్గొని ప్రసంగించాడు. బ్రిటిష్ ప్రభుత్వంచే నియమింపబడ్డ రాయల్ కమిషన్నారు డిసెబర్ 25వ తేదీన డా॥ అంబేద్కర్‌ను కలసికొని భారతదేశానికి క్రొత్త కరెన్సీ నోట్లను ప్రింటు చేసే విషయమై సంభాషించి తన అమూల్యమైన సలహాలను తీసికొన్నారు.

బహిష్కృత హితకారిణీ సభ

బహిష్కృత హితకారిణీ సభ ఆధ్వర్యాన తాను బొంబాయి రాష్ట్రంలో నిమ్నజాతుల దాస్య విముక్తికై పోరాటం సాగిస్తున్న కాలంలోనే ద్రవిడ నాయకుడైన ఇ.వి. రామస్వామి నాయకర్ మద్రాసు రాష్ట్రంలో అస్పృశ్యుల సాంఘిక హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. తిరువాన్కూర్ సంస్థానానికి జెందిన వైకం అనే గ్రామంలో అస్పృశ్యులు అనుభవిస్తున్న ఘోరమైన సాంఘిక కట్టుబాట్ల నెదిరిస్తూ రామస్వామి నాయకర్ పెద్ద ఆందోళన లేవదీశాడు. ద్రవిడ నాయకుడైన నాయకర్ మద్రాసు రాష్ట్రంలో సాగిస్తున్న సాంఘిక పోరాటాన్ని ప్రశంసిస్తూ, ప్రోత్సహిస్తూ డా॥ అంబేడ్కర్ తన ” సరస్వతి విలాస్ ” పత్రికలో సంపాదకీయాలు వ్రాశాడు. 1926వ సంవత్సరం మార్చిలో మురుగేశన్ అనే ఒక ఆది ద్రావిడ కులస్థుడు హిందూ దేవాలయంలోకి ప్రవేశించాడన్న నేరంతో అతన్ని హిందువులంతా గలసి చిత్రహింసలపాలు జేశారు. ఈ వార్త విన్న డా॥ అంబేడ్కర్ హృదయంలో అగ్నిజ్వాలలు రేగాయి. ఏప్రిల్ నెలలో జెజురీ అనే పట్టణంలో ఏర్పాటైన బహిరంగసభలో ప్రసంగిస్తూ హిందూ సమాజం అస్పృశ్యులపై కొనసాగిస్తున్న దారుణ హింసాకాండపై తన ఆవేదనంతా వ్యక్తం జేస్తూ హిందూ సమాజంలో సంస్కారభావం రానట్లైతే నిమ్న జాతీయులంతా ప్రత్యేక వలస ప్రాంతాలను ఏర్పాటు జేసి కోవలసి వస్తుందనీ, దానివల్ల భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర పరిణామాలకు హిందువులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించాడు. న్యాయ శాస్త్రంలో తనకు గల ప్రజ్ఞాపాటవాన్ని గూర్చి తెలిసికోవడంలో బొంబాయి నుండేగాక పరిసర ప్రాంతాల నుండి గూడ చాలామంది తమ కోర్టు వ్యవహారాలను అంబేడ్కర్ వద్దకే తీసుకురాసాగారు. అంబేద్కర్ చేపట్టిన కేసుకు విజయం తప్పదన్న పేరు మారుమ్రోగడంతో తన ప్రాక్టీసు బాగా పెరిగి రెండు చేతులా ఆర్జించడం మొదలు పెట్టాడు.

ఉన్నవాళ్ళ వద్ద నుండి ఫీజు వందల్లో గుంజినా లేనివాళ్ళ విషయంలో స్టాంపు ఖర్చు గూడ తానే భరించి కేసులు నడిపించేవాడు. ఒకవైపు ప్రాక్టీసు జోరుగా నడిపిసూనే బాబ్లీబాయ్ వారి గణితశాస్త్ర శిక్షణాలయములో కొన్ని గంటలు పాటు వ్యాపార చట్టాన్ని ( Marcantile Law ) బోదించేందు గూడ అంగీకరించాడు. ఇదే సమయంలో తాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించబడ్డాడు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories