మన నాయకుడు అందరి వాడిగా అందరికీ

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది.

నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది. ఇరవై ఆరు సంవత్సరాల న ప్రజాజీవితం, రాజకీయ జీవన ప్రస్థానం పై విపులంగా వివరించే పుస్తకంగా ‘నేను..నా ప్రజలు..నా యానాం’ ను తలుస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఎన్నో భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలిగే సంఘటనలు నా జీవితం నిండా. అక్కడికి నేనేదో రాజకీయాల్లో ఆరితేరి నేననుకున్నది సాధించానని విర్రవీగ లేదు.
చదువు అంతగా లేకపోయినా కలలో కూడా ఊహించని పదవులను పొంది యానాం ప్రగతికి రాత్రింబవళ్ళు కృషి చేసి అందరూ మెచ్చేలా యానాంను తీర్చిదిద్దిన ఆత్మ సంతృప్తి నాకుంది. ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితం తర్వాత ఒక కూడలిలో నిలబడి ఇంతవరకూ మీ కృష్ణారావుగా నేను నా యానాం ప్రజలకు అన్ని రంగాల్లో ఏం చేసానో ఇప్పటి వారికి రాబోవు తరాల వారికి చెప్పడానికి మాత్రమే ఈ పుస్తకం తీసుకురావడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని విజ్ఞులు గ్రహించగలరు.

ఒక సామాన్యుని జీవితం అంచెలంచెలుగా ఎదిగిన వైనాన్ని అర్థం చేసుకుంటే చాలు

 
ఈ పుస్తకానికి సార్థకత లభించినట్టే. ప్రజలకు నన్ను నేను తిరిగి పరిచయం చేసుకునే క్రమంలో వారితో మాట్లాడుతున్నట్లుగా అనుభూతి చెందాను. ఈ పుస్తకం ద్వారా యానాం ప్రజలకు మరింత దగ్గరయ్యానని అనుకుంటున్నాను. మీ హృదయాల్లో నా స్థానం ఎప్పటికీ పదిలంగా ఉండగలదని భావిస్తున్నాను.

మన యానాంకు చెందిన ఏ యువకుడైనా ఏ రంగంలోనైనా చెప్పుకోదగిన ప్రతిభతో రాణిస్తే నా కంటే ఎక్కువ సంతోషించేవాడు మరొకరు ఉండరు. అటువంటి వారిని ఎంతగానో ప్రోత్సహిస్తానని మీకు తెలుసు. ప్రతి వ్యక్తి లోనూ బయటపడని, లోపల దాగిన ఎంతో కొంత శక్తి ఉంటుంది. అవకాశాల్ని అంది పుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే నాలా తయారవ్వగలరనే సందేశాన్ని ఈ పుస్తకం ఇస్తుందని నా నమ్మకం. ఒక చిన్న వ్యాపారం చేసుకోడానికి రుణం కోసం ప్రయత్నించినపుడు ఎదురైన అనుభవం నన్ను ప్రజాజీవితం లోకి లాక్కెళ్లింది. బతుకు పోరాటం చేస్తున్న తొలి రోజుల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ళు నాకెన్నో పాఠాలు నేర్పాయి. ప్రజాబంధం నన్ను కట్టి పడేయడం వల్లే ఇన్నాళ్ళూ మీ అభిమానాన్ని ప్రేమనూ పొందగలిగాను. ప్రజలే శ్వాసగా బతికాను. ఈ జీవితానికి ఇది చాలు అనుకునే తృప్తి నాలో ఉంది.

వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయినా నేను పడిన శ్రమ వృధా కాలేదని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నన్ను చిరకాలం గుర్తించుకునే పనులు నా యానాంకు చేసాననే అనుకుంటున్నాను. నన్ను సమాజం గుర్తించింది. దేశ విదేశాలలో నా పని తీరును మెచ్చుకున్నారు. పెద్దలు ఆశీర్వదించారు. మహిళలు వెన్నంటి ఉండి సోదరునిగా నుదుట తిలకం దిద్ది నడిపించారు. నేను తల పెట్టిన పనులు పూర్తయిన వెంటనే చేసిన భక్తి యాత్రలను విజయవంతం చేసారు. నాకు ఈ స్థానం మీ వల్లనే వచ్చింది. అందుకు నేనెప్పటికీ రుణపడే ఉంటాను. నేను కొన్ని విలువలకు బద్దుడినై పని చేసాను. సామాజిక అవసరాల్ని గుర్తించి సరైన సమయంలో స్పందించి మేలు చేయడానికే ప్రయత్నించాను. నేను పొందిన పురస్కారాలు, సత్కారాలు కంటే మీ అభిమానమే ముఖ్యమని భావించాను.

టీ.వీ, సినిమా, కథ, నవల రచనల్లో తలమునకలుగా ఉండి నా మీద అభిమానంతో

తన విలువైన కాలాన్ని వెచ్చించి అతి తక్కువ కాలంలో అందరూ చదవగలిగే రీతిలో నా మాటల్ని అక్షరాల్లో పెట్టి పుస్తక రూపంలోకి తీసుకొచ్చినందులకు ప్రసిద్ధ రచయిత పి. చంద్రశేఖర అజాద్ గారికి నా తరపున, యానాం ప్రజలు, నా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన కొన్ని రోజులు నన్ను దగ్గరగా పరిశీలించి నా భావాల్ని అర్థం చేసుకుని ఎంతో శ్రమపడి అనేక వ్యాఖ్యానాలతో విలువైన పుస్తకంగా తీర్చిదిద్దారు. ఈ పుస్తకం ఆయన అందించిన విలువైన బహుమతిగా తలుస్తున్నాను.
 
మంచి సలహాలు సూచనలు ఇవ్వడమే గాక ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాసిన మిత్రులు కళైమామణి, తెలుగురత్న పురస్కార గ్రహీత దాట్ల దేవదానం రాజు గారికి ఎంతయినా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నా శ్రేయస్సు కోరి ఎన్నో సంవత్సరాలు నాకు అనుచరులుగా అండగా నిలిచి నడిపించిన నాయకులకు,
 
వివిధ మతాల పెద్దలకు, అన్ని సామాజిక వర్గాల వారికి, పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లకు ధన్యవాదాలు. ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అడుగడుగునా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని మనో నిబ్బరాన్ని ఇస్తున్న నా కుటుంబ సభ్యులు ఉదయలక్ష్మి, రఘువంశీ, లక్ష్మీ ప్రసన్నలకూ అతి తక్కువ సమయంలో అందంగా ముద్రించి ఇచ్చిన శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారికి నేను… నా ప్రజలు… నా యానాం ‘ వెలువడటానికి అవసరమైన ఆర్థిక సహకారం సమకూర్చిన సహృదయ మిత్రులందరికీ… కృతజ్ఞతలు.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories