ఏ వ్యక్తి జీవితంలో అయినా బాల్యం- యవ్వనం అత్యంత ముఖ్యమైనవి.

ఎంతటి ప్రతిభావంతుల్నయినా అంచనా వేయాలంటే వారు పుట్టి పెరిగిన వాతావరణం, బాల్యం నుండి వారి మీద పడిన ముద్రలను తెలుసుకోవాలి. సామాన్య వ్యక్తులు కూడా అసాధారణంగా ఎదగటానికి మధ్య, తమ గమ్యాలను నిర్దేశించుకోవటానికి మధ్య ఈ క్రమం వుంటుంది. పుట్టుకతోనే ఎవరూ గొప్పవారూ, చెడ్డవారు కాదు. వారిని మార్చేది భౌతిక పరిస్థితులు. తాము ఏం చేయాలి, ఎవరి పక్కన నిలబడాలనేది తేల్చుకోవాల్సింది వ్యక్తులే. ఇది ప్రారంభం.

బాల్యం- యవ్వనం

నేను జూన్ ఆరవ తేదీన 1964లో దరియాలతిప్పలో పుట్టాను. అది యానాంకి చెందిన శివారు గ్రామం. మా అమ్మ వెంకటరత్నం. మా నాన్న సూర్యనారాయణ. మాది వ్యవసాయదారుల కుటుంబం. నాకు తెలిసి చిన్నప్పటి నుండి తీవ్రమైన ఆర్ధిక యిబ్బందులు నేను అనుభవించలేదు. మాకు స్వంత ఇల్లు వుండేది. పెంకుటిల్లు. మా ఇంట్లో టీ.వీ, టేప్ రికార్డర్, రేడియో, సైకిల్ వుండేవి.

నేను తొలి అక్షరాలు దిద్దుకుంది ప్రాథమిక పాఠశాలలో. నా తొలి గురువులు వంకాయల రామలింగేశ్వరరావు, చెక్కల గణపతి, పైడికొండల వెంకటేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం మాస్టార్లు. అప్పటి ఉపాధ్యాయుల్లో క్రమశిక్షణ చెప్పుకోతగింది. మనం ఇప్పుడే పిల్లల్లో బలమైన పునాది వేయాలనుకునేవారు. బడికి రాని పిల్లల పట్ల ఆరాటపడేవారు. మా అందరికీ వారంటే భయం, భక్తి వుండేవి.
 
హైస్కూల్ కి వచ్చేసరికి సలాది సుబ్బారావు, సయ్యద్ హబిబుల్లా, డ్రిల్లు మాస్టారు రమణగార్లుండేవారు. రమణ మాస్టారు మంచి మంచి కథలు చెప్పేవారు. అనేకమంది కథలు చెబుతారు. అయితే ఆయన చెప్పే తీరు మాకు విపరీతంగా నచ్చేది. ఆయన ఎన్నుకునే కథలు అలా వుంటాయి. ఎక్కడ మొదలు పెట్టి, మధ్యలో ఉత్కంఠని కలిగించి, ఎలా ముగించాలో ఆయనకు తెలుసు. నా వరకు నేను ఆ విధానాన్ని గుర్తుపెట్టుకున్నాను. ముఖ్యంగా ముగింపులో ఓ ఆశ్చర్యాన్నో, ఓ షాక్ నో కలిగించటం వల్ల చాలాకాలం అవి నన్ను వదిలిపెట్టలేదు. అంతేకాదు ఓ భయంకరమైన సత్యాన్ని, ఆకస్మిక మృత్యువు లాంటి విషయాల్ని ఎదుటి వారికి భయం- ఆందోళన, షాక్ కలిగించే తీరులో చెప్పకూడదు. ఒక్కోసారి బలహీనులకు ఆ వార్త వింటే బలహీన మనస్కుల గుండె ఆగిపోవటమో, కుప్పకూలిపోవటమో జరుగవచ్చు.
 
మనం ఎదుటివారికి మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత బాగా, అర్ధమయ్యేలా చెప్పామనేదే ముఖ్యం. పెద్దయ్యాక ఇలాంటివి నాకు ఉపయోగపడ్డాయి. డ్రాయింగ్ మాస్టారు చెల్లి కృష్ణారావుగారు నాకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పించే ప్రయత్నం చేసారు. నాకు ఆ విద్య పట్టుబడలేదు. అసలు నా దృష్టి వేరుగా వుండేది.

ఆయన పేదవారి జీవితాల గురించి, ముఖ్యంగా అంటరానితనం గురించి,

వెనకబడిన కులాల గురించి వివరంగా మాట్లాడుతుండేవారు. మా ప్రాంతాల్లో అప్పుడు ఎటు చూసినా దయనీయమైన పరిస్థితులు వుండేవి. నా స్నేహితుల్లో ఎక్కువ భాగం వారే. నాకు తెలియని అనేక విషయాలు మాస్టారు చెప్పేవారు. అప్పటి నుండి ఏ విషయాన్నయినా పైపైన చూడటం వల్ల పూర్తి చిత్రం మన ముందుకు రాదు అనేది

తెలిసింది. ఏ విషయమయినా దాని మూలాల్లోకి వెళ్లాలి. లోతుగా అధ్యయనం చేయాలి. దొంగతనం, వ్యభిచారం, దురలవాట్లు, దిగజారి పోవటం, డబ్బు కోసం ఎలాంటి క్రూరమైన పనులయినా చేయటం, పిల్లల్ని- ఆడవారిని ఎత్తుకుపోయి అమ్మేయటం, ఇలాంటి సవాలక్ష విషయాలున్నాయి. అలాగే ఒకే తరహా తప్పులు కూటికి గతి లేని వారూ, లక్షలు సంపాదించిన వారూ చేస్తారు. అప్పుడూ అందరినీ

ఒకే గాటన కట్టాలా! ఇలాంటి వాటి పట్ల మనం ఎలా స్పందించాలి- ఇవన్నీ నాలో ఆలోచనలు కలిగించటం మొదలు పెట్టాయి. అంతేకాదు అవి బొమ్మలు కావచ్చు. పెయింటింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు. వాటిని మానసిక తృప్తి కోసం మాత్రమే కాకుండా, ప్రజల్లో చైతన్యం కలిగించటానికి ఉపయోగించు కోవాలి అనే స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. తర్వాత యానాంని సరికొత్తగా తీర్చి దిద్దటానికి అవి నాకు ఉపకరించాయి.

ఆ తర్వాత జూనియర్ కళాశాలలో సి. ఎల్ నారాయణ, భాస్కరశర్మ, డేవిడ్ రాజు, పల్లి సుబ్బారావు గార్ల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

ఇంటర్ మీడియట్ నేను ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నేను చదువు కొనసాగించాలనుకోలేదు. ఇప్పుడయితే అయిదో తరగతి నుండే పిల్లలకు వారు ఏం కావాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తున్నారు. ఆ మాటకు వస్తే బడిలో చేర్పించటంతోనే వారి ఎన్నిక వుంటుంది. మా కాలంలో ఇంటర్ దాకా వచ్చినవారు భవిష్యత్ పట్ల ఓ నిర్ణయానికి వచ్చే దశ అది. సాధ్యాసాధ్యాలు వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితుల మీద
ఆధారపడేది.
నేను ముందు నుండి ఏదో కావాలనుకోలేదు

నేను ముందు నుండి ఏదో కావాలనుకోలేదు. మహా అయితే డ్రిల్లు మాస్టారిని కావాలనుకున్నాను. అందుకు ఏ అర్హతలుండాలో నాకు తెలియదు. నేను మంచి అథ్లెటిని. నా దగ్గర సర్టిఫికెట్లున్నాయి. అందుకే ఉద్యోగం వస్తుందనుకునే వాడిని. బిపిటి చేయాలని కూడా నాకు తెలియదు. చదువు మీద కంటే ఆటల మీదే నా కేంద్రీకరణ. అలా ఆడుతుంటే నాకు తెలియని ఆనందం. ఆటలన్నీ అందరికీ అందుబాటులో వుండవు.

మనం మన ఇష్ట ప్రకారం కాకుండా, మనకున్న ఆర్థిక స్థితిని బట్టి ఆటయినా, పాటయినా, చదువయినా, బట్టల నుండి తిండి వరకు నిర్ణయించుకోవాలి తప్ప మనకు స్వేచ్ఛ వుండదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తంగా నా బాల్యం, యవ్వన ప్రారంభం వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే నాలో ఎలాంటి ప్రణాళికలు, దూరదృష్టి లేవు. వ్యవసాయ కుటుంబం నుంచి రావటం, పెద్దగా యిబ్బందులు లేకపోవటం వల్ల నాలో అంత కసి, ఏదో సాధించి తీరాలనే పట్టుదల లేవనుకుంటాను.
 
చిన్నప్పట్నుంచి నా ఖర్చులకు నేనే సంపాదించుకోవాలి అనుకునే వాడిని. మంచి బట్టలు వేసుకోవాలని, షూస్ వేసుకుని, నీట్గా, దర్జాగా వుండాలనిపించేది. నాకు గట్టు మీద నిలబడి పనులు పురమాయించే రైతుగా వుండాలని లేదు. వ్యవసాయానికి చెందిన అన్ని పనులూ నాకు తెలుసు. నేను స్వయంగా చేసాను. పాలు పితకటం, గడ్డి కోయటం, అరక దున్నటం, పేడ తీయడం అన్నీ తెలుసు.
 
చేసాను. నా గతం గురించి తెలియని వారు వ్యవసాయంలో వున్న సమస్యల గురించి తాము మహా కష్టపడిపోతున్నట్లు, ఇలా చేయాలి అలా చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు నేను కలగజేసుకుని వాటి గురించి వివరిస్తుంటే, ఇవన్నీ మీకెప్పుడు తెలుసు అంటారు. తెలవటం కాదు. నా వేళ్లు అక్కడే వున్నాయి అంటాను.
 
అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు ప్రత్యేకుగా వింటారు. వ్యవసాయరంగంలో ఇన్ని సమస్యలు వున్నాయా… మనం ఇంత చేయాలా అని ఆశ్చర్యపడతారు. కొంతమందికి బొత్తిగా వ్యవసాయం గురించి తెలియదు. నేను స్వయంగా వ్యవసాయ పనులు చేసి వుండకపోతే నాకూ తెలిసేది కాదు. ఎప్పుడయినా వినటం వేరు. అనుభవాన్ని మించింది లేదు అనేది అందుకే,

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories