వృత్తి, నాకు వృత్తిలో వుండే కష్టాల గురించి తెలుసు

అంతేకాదు మాది మత్స్యకారుల కుటుంబం. చేపల వేట మా కుల ప్రణ వృత్తి, నాకు వృత్తిలో వుండే కష్టాల గురించి తెలుసు. మనుషుల్లో ఎన్ని రకాల వారుంటారో మత్స్యకారుల్లోనూ అంతే. చేపల్లో వున్న అనేక రకాల గురించి తెలుసు. ఏ సమయంలో చేపలు, రొయ్యలూ, శీరమేను (ఇది చాలా ఖరీదు అయిపోయింది) పులసలు లాంటి విభిన్న రకాలు దొరుకుతాయో, ఎప్పుడు తీరానికి వచ్చి గుడ్లు పెడతాయో ఇవన్నీ మా మత్స్యకారుల నుండి స్వయంగా నేను తెలుసుకున్నాను. చదువుకుంటూ ఇక్కడ అనేకమంది పని చేస్తుంటారు. నాకు అలాంటి అవసరం లేకపోయింది. నా స్వంత ఖర్చులకు ఇంట్లో ఇచ్చేవారు.

నా చిన్నప్పటి నుంచి యానాంని నేను చూస్తున్నాను. అందులో

ప్రత్యేకదృష్టి అంటూ లేదు. మనం వెనకబడున్నాం. మనకి అన్నీ రావాలి అనుకునేవాడ్ని కాదు, అందరితోపాటు బతుకుతున్నాం. తెల్లవారుతుంది. రాత్రవుతుంది. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇదంతా సహజం అనిపించేది. అసలు యింకో ఆలోచన వుండేది కాదు. ఎప్పుడయినా ఇతర జిల్లాల్లో జరిగే పోటిలకి, ముఖ్యంగా ఆటలకి వెళ్తుండేవాడిని. అక్కడున్న ఆట స్థలాలూ, క్రీడా పరికరాలు, గదులు, ఇలాంటివి చూసినప్పుడు ఇవన్నీ మనకు ఎందుకు లేవు. యానాంలో వుంటే బాగుంటుంది కదా అనిపించేది. అంతేగాని ఇవన్నీ మనం పట్టుదలతో సాధించుకోవచ్చు అనే ఆలోచన రాలేదు. కాలేజికి వచ్చేవరకు పాలనా వ్యవస్థ గురించి కూడా నాకు తెలియదు. .
నా వివాహం అయిన తర్వాత నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి చెప్పాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పాతికవేల రూపాయలు ఇస్తున్నారు. అది అప్పు మాత్రమే. అది తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాను. ముందుగా బ్యాంక్ వారిని కలిసాను. అందుకోసం ఆనాటి
ఎమ్మెల్యేగా వున్న కామిశెట్టి గారిని కలవటం మంచిదన్నారు. కోలా వెంకటరత్నం (జార్జిపేట), చెక్కల అబ్బులు నన్ను వారి ఇంటికి తీసుకు వెళ్లారు. చాలాసేపు ఎదురు చూసాం. మూడు గంటలకు పైగా నిరీక్షణ. యువకుడ్ని కదా, బోల్డంత అసహనం, రాజకీయ నాయకులకు ఎంత ‘పవర్’ వుంటుందో అప్పుడు తెలిసింది. ఆ రోజు ఆయన్ని కలవలేకపోయాం . తర్వాత ఆయన్ని నేను కలవాలని అనుకోలేదు.

నేను స్వయంగా బ్యాంక్ అధికారుల్ని కలుసుకున్నాను. వారితో మాట్లాడి రుణం సాధించుకున్నాను.

అనుకున్న సమయంలో తీర్చెసాను. కామిశెట్టిగారిని కలిసి, ఆ రుణం వారి ద్వారా నాకు వచ్చి వుంటే రాజకీయాల్లోకి రావాలి అన్న కసి, పట్టుదల నాకు వుండేవి కాదు. జీవితంలో రహదారి సూటిగా వుంటే ప్రయాణం సులువుగా సాగుతుంది. మలుపులు వచ్చినప్పుడే అప్రమత్తంగా వుండాలి. ఏ మలుపు మన బతుకుల్ని ఏ మార్పుకు తీసుకు వెళ్తుందో తెలియదు.
చిన్ననాటి స్నేహితుల గురించి చెప్పాలంటే ఎందరో వున్నారు. అన్ని కులాల్లో వున్నారు. అన్ని మతాల వారున్నారు. అలాగే చదువు చెప్పిన వారిలోనూ అందరూ వున్నారు. వారు చదువు మాత్రమే చెప్పరు. వారి కులాల, మతాల, కుటుంబాల నుండి కొన్ని కొన్ని భావాలను తీసుకొస్తారు. వేషధారణ నుండి భాష వరకు భిన్నత్వం వుంటుంది. వారి మధ్య పోటీలు, జెలసీలు, కొందరు విద్యార్థుల మీద అభిమాన,
దురభిమానాలు వుంటాయి. అవన్నీ స్వయంగానూ, మిత్రులతో కలిసి గమనించే వాడిని. అలాగే స్నేహితులు కూడా భిన్న వర్గాల నుండి వుంటారు కాబట్టి వారి మనోభావాలు తెలిసేవి.
  • స్నేహం పట్ల నాకు మంచి అభిప్రాయం వుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు అంటారు. అవన్నీ ప్రయోజనాల ప్రాతిపదిక మీద, అధికారం, పదవుల కోసం వుంటాయి.
  • స్నేహం కూడా ఓ పక్కనే వుండటం, స్నేహాన్ని కేవలం వ్యక్తిగతంగా ఉపయోగించుకోవటం, పనులు జరిపించుకు తీరాలనుకోవటం, ఇలాంటి లక్షణాలు స్నేహంలోకి ప్రవేశిస్తే మామూలు జీవితంలోనూ స్నేహాలకు దూరం కావటం  జరుగుతుంది.
  • అవి శత్రు సంబంధాలుగా మారవచ్చు. అయినా స్నేహమూ-శత్రుత్వం ఎల్లకాలం జీవితంలోనూ కొనసాగవు. భౌతిక పరిస్థితులూ, సంఘటనలు వాటి
    స్థానాలను మారుస్తుంటాయి.
మాది ఫ్రెంచ్ పాలనలో సాగిన ప్రాంతం. చిన్నప్పుడు నాకు ఫ్రెంచ్ వారంటే బాగా డబ్బులున్న వారని మాత్రమే తెలుసు. జిన్నూరి భానుమతి, వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఫ్రెంచ్ నేషనాలిటీ వున్న కొంతమంది స్నేహితులతో సన్నిహితంగా వున్నాను. వారి వల్ల ఫ్రెంచ్ వారి జీవితానికి చెంది కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అయితే నేను ఫ్రాన్స్ వెళ్లగలనని మాత్రం అనుకోలేదు. అలాంటి ఆలోచన లేదు. నా చిన్నతనంలో ఫ్రెంచ్ వారిని చూసానేమోగాని మాట్లాడలేదు. అందుకు తగ్గ భాష లేదన్నది వేరే సంగతి.
నేను బాల్యం, కౌమారం నుండి యవ్వన దశకు వస్తున్నప్పుడు జరిగిన ప్రయాణంలో కళలంటే ఇష్టం వుంది. అవన్నీ చూసి ఆనందించటానికి మాత్రం పరిమితం. గణపతి మాస్టారు నాటకాలు వేస్తుండేవారు. నోటిలోంచి రక్తం కారాలంటే కంచె కాయలు వాడేవారు. అవసరాన్ని బట్టి వాటిని నేను  సుకువచ్చేవాడిని. అప్పుడు ముళ్లు గుచ్చుకుని ఒళ్లంతా చీరుకుపోయేది. అయినా ఆ దృశ్యంలో నోటి నుండి రక్తం ఎలా వచ్చింది అని జనం ఆశ్చర్యంగా చూస్తుంటే నాకు మాత్రం ఆనందం కలిగేది. మనకు మాత్రమే కొన్ని రహస్యాలు తెలిసి, ఇతరులకి తెలియకపోవటంలోని ఆనందం అది.

ఇంక నేను ఎలా వుండాలో నేనే నిర్ణయించుకున్నాను. అందులో మా తల్లిదండ్రుల పాత్ర లేదు. ముందు ఇంకొన్ని సంగతులు వస్తాయి.

ఎవరి జీవితంలో అయినా బాల్యంలో, యవ్వనంలో అనేకమంది ప్రభావాలు వుంటాయి. అవి అప్పుడు మనం గుర్తించం. రక్తంలో చేరిపోతాయి అంటాం కదా, వ్యాధులు మాత్రమే కాదు మంచి ఆలోచనలూ రక్తంలో భాగం అవుతాయి. అలాగే దుష్ట ఆలోచనలు కూడా.
అలా చూసుకున్నప్పుడు ఆ దశలో మహాత్మాగాంధీ, అంబేద్కర్లు నా మీద ప్రభావం చూపించారు. ఇందిరాగాంధీ ఏ నిర్ణయం తీసుకోవటంలో అయినా డైనమిక్గా వుండే స్వభావం నాకు నచ్చింది. ఇరవై సూత్రాల పథకం పట్ల ఆకర్షితుడ్ని అయ్యాను.
స్నేహితుల కోసం, వారితో ఆడుకుందామని, కలసి సినిమాలు చూడటానికి బాగుంటుందని బి.సి. వర్గానికి చెందిన నేను, యస్.సి హాస్టల్లో వున్నాను. ఆ హాస్టల్ మన్యంవారి మేడలో వుండేది. నా తర్వాతే బి.సిలకు చెందిన బొక్కా బాల, బొక్కా రామసుబ్బారావు, చెక్కా ధర్మారావు, శేరు రమణ చేరారు. ఎస్.సి బాయ్స్ హాస్టల్ లో వున్నప్పుడు దీనపోషక సమాజంకు వెళ్లినప్పుడు అంబేద్కర్ గురించి తెలుసుకున్నాను. అక్కడ ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. తర్వాత స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గురించి తెలిసింది. ఆయన ఈనాటి మన స్వేచ్ఛకు ప్రాణాలు యిచ్చాడని, అదీ స్వతంత్రం సాధించాక అని తెలుసుకుంది అక్కడే. స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు రకరరకాల సమస్యలు వస్తుంటాయి
కదా అప్పుడు నేను ముందుండేవాడిని. విద్యార్థులందరినీ కూడగట్టాలి. సమ్మె చేయించాలి. అలాంటి వాటిల్లో ఉత్సాహంగా వుండేది. కొంతమంది మాత్రం ఇలాంటి వాటి విషయంలో ఆసక్తి చూపించే వారు కాదు. అందుకు ఇంటి దగ్గర ఏమన్నా అంటారని భయమో, తమ చదువు చెడిపోతుందనుకునే వారో గాని దూరంగా వుండేవారు.
సమ్మె చేసేవారి వల్ల వచ్చే అవకాశాల వారికీ వస్తాయి కదా ఎందుకు చేయరు అనుకునేవాడిని. ఇంకొంత మంది సమ్మెని వ్యతిరేకించేవారు. మాస్టార్లంటే భయపడేవారు- తర్వాత ఏమైనా చేస్తారేమోనని. మేం వారికి వ్యతిరేకంగా సమ్మె చేయటం లేదు. ఆ మాటకొస్తే వారు కూడా జీతాల కోసమో, ఇంక్రిమెంట్ల కోసమో ఇంకోదాని కోసమో అప్పుడప్పుడు సమ్మెలు చేసేవారు.
  • ఇవన్నీ నా మనసులో చోటు చేసుకునేవి. ఇప్పుడు ఆలోచిస్తుంటే జీవితంలో మిగతా అనుభవాల్లా ఇవీ వున్నాయి. రేపు యిలాంటివన్నీ నన్నూ, యానాంని, ఇక్కడి ప్రజల జీవనస్థాయిని మార్చగలవని తెలియదు.
  • అయితే నాకు పుస్తకాల్లో విషయాలు గుర్తుండవుగాని, ముఖ్యమైన ఏ విషయం అయినా గుర్తుంటుంది. అందుకు ఇంకేదో కారణం కాదు. ఆ రోజుల్లో నేను పుస్తకాలు, పాఠాలు చదవలేదు.
    వాటిని గుర్తుంచుకోవాలి అనుకోలేదు.
  • ఏదో చదువుకోవాలి గాబట్టి చదువుకుంటున్నాను. అందుకే అంటాను. నేను నిర్లక్ష్యం చేసినవి కూడా తర్వాత జ్ఞాపకాలుగా ఆయా సందర్భాల్లో నా ముందుకు వచ్చేవి. అందువల్ల జరిగిన నష్టాలు నాకు తెలుసుకాబట్టి ఇంకోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను.
అప్పుడు కుల సంఘాల్లోగాని, రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల్లో నేను పని చేయలేదు. నాకు రాజకీయాల్లోకి రావాలి. ఏదన్నా సంఘానికి నాయకత్వం వహించాలి అని వుండేది కాదు. కొంతమంది విద్యార్థి దశలోనే అలాంటి నిర్ణయానికి వస్తారు. నన్ను కొంతమంది అడుగుతుంటారు, ఇంత క్రియాశీలంగా వుంటారు. మీరు వామపక్ష, విప్లవవాద భావాలకు ప్రభావం ఎందుకు చెందలేకపోయారు అని. వాటి గురించి నేను విన్నాను తప్ప లోతుగా ఆ సాహిత్యం, ఫిలాసఫీ చదవలేదు. అవి చదివినా, ఆ ఉద్యమాల్లో పాల్గొన్నా నేను ఇలా వుండేవాడిని కాదు అని ఇప్పుడు చెప్పగలను.

తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా అక్కడ వెనక బడిన తరగతుల వారు

దళితులు, మైనారిటీలు, గిరిజనులు వుంటారు. వారి కోసం, వారి అభివృద్ధి కోసం పని చేసేవారు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం అవరు. నా జీవితం ఇప్పటి వరకు చూసుకుంటే నేను ‘యానాం’ వరకు పరిమితం అయ్యాను. అందుకు నేను సంతోషపడతాను తప్ప నేను చిన్న ప్రాంతానికి మాత్రమే దించుకుపోయాను అనుకోను. ఇక ముందూ ‘యానాం’ మాత్రమే నా కార్య స్థలం. అయితే అన్నీ మన చేతుల్లోనే వుంటాయని నేను అనుకోను. భగవంతుడు అసాధారణ పరిస్థితులు సృష్టిస్తే తప్ప నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవటం లేదు.దేవుడు ‘యానాం’ అనే పవిత్రమైన స్థలాన్ని నాకు అప్పగించాడని నేను అనుకుంటాను.
విద్యార్థి జీవితం అలా ముగిసిపోయింది. అదంతా ఓ అద్భుతమైన కలలా వుంటుంది. పెద్ద సంక్షోభాలు లేవు. చిన్న చిన్న ఆనందాలు కావచ్చు. అందరిలో ఒకడిలా బతికాను. ఎలాంటి గమ్యాలు పెట్టుకోలేదు. ఇక నుంచి ఏ రకంగా బతకాలి, ఏ వ్యాపారం చేయాలి అని మెల్లగా ఆలోచిస్తున్నాను.

ఇంటర్ చదువుతున్నప్పుడే నేను ‘ఉదయ’ను దగ్గరగా చూడటం జరిగింది.

ఉదయ నడవడిక నెమ్మదిగా వుండటం, ఇతరులతో మాట్లాడే విధానం ఆమెలోని సంస్కారం ఇవన్నీ నచ్చాయి. తను నా జీవిత భాగస్వామి అయితే బాగుంటుందనిపించింది.అప్పటికే నాకు కట్నం గురించి వ్యతిరేక భావన వుంది. పేదవారు, మధ్య తరగతి వారిని చూసాను. పెళ్లి అవక ముందు, ఆయ్యాక కూడా ఆడపిల్లల్ని కట్నం కోసం రకరకాల యిబ్బందులకు గురి చేసేవారు. పెళ్లి ఖర్చులు తట్టుకోలేక అప్పుల పాలయ్యే వారు. కట్నం మాత్రమే కాక పెళ్లి ఖర్చులూ మగవారికి ఇవ్వటం అనేది చేరింది. ఇలాంటివన్నీ నేను అంగీకరించలేకపోయాను. నన్ను నేను అమ్ముకోకూడదు. అనుకున్నాను. మార్పు మనతో మొదలవ్వాలనేది నా పద్దతి.
ఉదయ, నేను మాట్లాడుకున్నాం. పరస్పరం ఇష్టపడ్డాం. కట్న ప్రసక్తే లేదు. కట్టుబట్టల్లో అమలాపురంలోని ఓ గుడిలో నేను ఉదయను పెళ్లి చేసుకున్నాను. చదువు ఆగిపోయాక కొంతకాలం కొబ్బరికాయల వ్యాపారం చేసాను. రైతుల దగ్గర్నుంచి కొని, రాంబాబుగారి షాపు ద్వారా అమ్మకాలు జరిపేవాడిని.
ఈ పెళ్లి అనేది నాజీవితంలో ఓ పెను తుఫాన్. అప్పటిదాకా నేను మనుషుల్లో వున్న మంచితనాన్ని, స్నేహాన్ని మాత్రమే చూసాను. మనం కలలో కూడా వూహించలేదు అంటుంటాం. అలాంటి అనుభవం ఎదురయింది.
అప్పటి దాకా అందరూ నా వారు అనుకున్నాను. స్నేహితులు- సరదాలు- రేపు కష్టం వస్తుందనే ఆలోచన లేని ఓ జాలీ ప్రపంచం. వారం పది రోజుల్లోగా ప్రపంచం తల్లకిందులయింది.
కుటుంబం నుండి ఎలాంటి సపోర్టు లేదు. కొంతమంది స్నేహితులు దూరం అయ్యారు. అందరూ నన్ను, తనని వదిలేస్తారు. రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఎలా బతకాలి? మా రేపటిని, నా వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి. ఇవే ఆలోచనలు.
ఇంట్లో కొంతకాలం వ్యతిరేకత వుంటుందనుకున్నాను. మీగతావి వూహించలేదు. నిద్రరాదు- ఓడిపోతాం అనే నిరాశ, అనేకానేక భావాలూ, ఆవేశాలూ సుడిగుండంలా తిరిగేవి. ముందు ఇల్లు వెతుక్కోవాలి. స్కూటర్ పోయింది. కనీసం సైకిల్ కావాలి. నిద్రపోవటానికి మంచం కావాలి. వంట చేసుకోవటానికి సామాన్లు, సరుకులు కావాలి. ఆందోళన పడవద్దు ముందు ఏం చేయాలో చూద్దాం అంది ఉదయ.
నెలకు 30 రూపాయలచొప్పున వాయిదా కట్టేలా సైకిల్ తీసుకున్నాను. ‘ముంతాజ్ ఐరన్ షాపులో బీరువా, మంచం కూడా అప్పు మీద తీసుకున్నాను. అప్పటిదాకా అన్నీ వున్న నేను, అందరూ వున్న నేను ఒంటరివాడిని. నాకు తోడూ-నీడా నా ఉదయ. ఒకరికి ఒకరం. ముందు మేం కలిసి ఎదుర్కోవాల్సిన
పెద్ద ప్రపంచం.

ఇన్ని సంవత్సరాల మా ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగి ఇప్పటి దాకా జరిగిన నా రాజకీయ, కుటుంబ, ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను గమనించింది మీకు చెప్పాలి.

రాజకీయ నాయకులు ప్రజల నుండి ఎంత ప్రేమనయినా పొందవచ్చు. అధికారంలో వున్నప్పుడు రాచరిక పద్ధతుల్లో విలాసవంతంగా గడపవచ్చు. అప్పటిదాకా వారిని పట్టించుకోని వారు, అవమానించిన వారు, తమను మనుషులుగానే పరిగణించని వారు పదవులు రాగానే దగ్గరకు వస్తారు. అత్యంత వినయం చూపిస్తారు. అప్పటి దాకా తాము ప్రవర్తించిన తీరు గురించి మరిచిపోయి, కులాన్ని మరిచిపోయి స్వంత మనుషులం అన్నట్లు వ్యవహరిస్తారు. బయట అలా చెప్పుకుంటారు.

నేను అప్పుడప్పుడూ అంటుంటాను రాజకీయాల్లోకి రాకముందూ, వచ్చాక మీరు గమనించిన తేడా ఏమిటి అంటే అంతకు ముందు నేను అధికారుల్ని, పదవుల్లో వున్న కొంత మందినయినా కలిసాను. ఇప్పుడు వాళ్లు నా దగ్గరకు వస్తున్నారు. అప్పుడు పనులు చేయండి అని అడిగాను. ఇప్పుడు నా ప్రజలకు ఈ పనులు చేయమని చెబుతున్నాను అంటూ. ఇది రాజకీయ నాయకుల జీవితాల్లో ఓ పక్క మాత్రమే. రెండో పక్కన కుటుంబ జీవితం ఇలా వుండదు.

నేను కొంత మంది జీవితాల్ని దగ్గరగా చూసాను. ఇంకొంత మంది గురించి మనం వింటుంటాం. చదువుతుంటాం. అనేకమంది విషయంలో ప్రత్యర్థులు చేయలేని నష్టాలను కుటుంబ సభ్యులు చేస్తారు. పరువుని బజారుకు ఈడుస్తారు. అది సంతానం వల్ల, భార్య వల్ల కావచ్చు. అదే మహిళా నాయకురాళ్లకు భర్త వల్ల, బంధువుల వల్ల కావచ్చు. ముందు రాళ్లు విసురుతారు. బురద జల్లుతారు. ఓసారి నాలుగు గదులుదాటి జనం మధ్యకు బహిరంగంగా వచ్చాక మన స్వంతం అనటానికి వుండదు. ఇప్పుడు సామాన్యుల బతుకుల్లోకీ కెమెరాలు వచ్చాయి. అది వేరే విషయం.
ముందు రాజకీయ నాయకులకు తీరిక వుండదు. పిల్లల చదువుల దగ్గర్నుంచి, వారు ఎప్పుడేం చేస్తున్నారు, వారి అలవాట్లు ఏంటి, వారి స్నేహితులు ఎలాంటి వారు, వారి ఆర్థిక లావాదేవీలు, తండ్రి లేదా తల్లి అధికారాన్ని ఎలా దుర్వినియోగ పరుస్తున్నారు అనేది తెలుసుకునే సమయం వుండదు. మామూలు మధ్య తరగతి, కింది తరగతుల వారికే ఇలాంటిదున్నప్పుడు- రాజకీయ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అందరితోపాటు ఉలిక్కిపడతారు.
అంటే రాజకీయ నాయకులకు ఇంటి నుండి సహకారం వుండాలి. పిల్లల బాధ్యతలను భార్య తీసుకోవాలి. అలాగే కుటుంబంలో వచ్చే ఎలాంటి సమస్యనయినా వారు పరిష్కరించటం, వారి భర్తల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావటం చేయాలి.
నా శ్రీమతి ఈ విషయం లో నాకు అన్ని రకాలుగా సహకరించింది. కుటుంబ బాధ్యతలన్నీ తను చూసుకుంది. దాంతోపాటు ఏ క్షణంలో అయినా నేను నిరాశకు గురయినా తను మాత్రం నా భుజం తట్టి మీరు అన్నీ సాధించగలరు అనే నమ్మకాన్ని ఇచ్చేది. చిన్నప్పటి నుంచి నాలో దైవభక్తి వున్నా ఉదయ నా జీవితంలోకి వచ్చాక మరింతగా నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోయాను. అప్పటికీ ఇప్పటికీ నా రోజువారి జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ మౌనంగా వుంటూనే నన్ను నడిపిస్తోంది. ఈ సందర్భంగా నిండు మనస్సుతో ఉదయకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

Related Stories

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Also Read +
x

Related Stories